*2025, సెప్టెంబర్ 1 నుంచి లెటర్స్ రెడ్ బాక్స్ ఉండదన్న వార్త తెలిశాక కలిగిన దుఃఖం...*
*సెలవు.. ఇక సెలవు అంటున్న ఉత్తరాల ఎర్ర డబ్బా*
*దశాబ్దాలుగా నిస్వార్థంగా నిశ్శబ్దంగా నిశ్చలంగా విశ్వసనీయంగా సేవలు అందించిన భావోద్వేగాల నేస్తం ఇక కనిపించదు. మన ముత్తాతలు, తాతలు, నాన్నల కాలం నాటినుంచి మన ఇళ్లకు దగ్గరలోనో, వీధి చివర్ల లోనో,పోస్ట్ ఆఫీస్ దగ్గర అభిమానంతో ఎదురు చూసిన నెచ్చెలి. ప్రేమలు ఆత్మీయత తో కూడిన వార్తలు మోసుకొస్తూ, తీసుకు వెళ్తూ సంధాన కర్తగా, సేవలు అందించిన స్నేహశీలి . ఆశల కబుర్లు మోసుకు వచ్చి మనస్సుల్లో సంతోషాల పంచిన మిత్రుడు నేను.. ఇక కనిపించను అంటే ఎలా ఉంటుందో ఊహించటం కష్టం . అది తెలియని , చెప్పలేని బాధ.*
*ఒకటా, రెండా చెప్పటానికి.*
*సుదూర తీరాలలో ఉన్న బంధువులు, మిత్రులకు మన ఇంటిల్లిపాది విషయాలను మోసుకు వెళ్ళింది.అలాగే తీసుకు వచ్చింది. శుభ వార్తలు, పెళ్లి శుభలేఖలు, పరీక్షా ఫలితాలు, ఉద్యోగ అవకాశాలు, ఉద్యోగం వచ్చిందనే తియ్యని కబురు ఇలా ఎన్నో మోసిన సమ్మోహన పెట్టె ..ఎర్ర డబ్బా..కాదు కాదు..మన జీవనంకు లింకే.. కదా... ప్రేమికులకు హృదయ స్పందన... సరిహద్దు సైనికులకు తమ వారి నుంచి వచ్చే ఒక శ్వాస అయింది కదా. అప్పుడప్పుడు కన్నీటి వార్తలను కూడా దిగమింగి చేర్చింది. ఒక్కసారి చేతి ముని వేళ్ళతో తనలో జార విడిచిన తరువాత , తిరుగు సమాధానం వచ్చే వరకు వేచి చూడని వారు ఉండరు కదా*
*బాబూ వీధి మూలన ఉన్న డబ్బాలో ఈ ఉత్తరం కాస్త వేసి రామ్మా ..అల్లుడు దగ్గర నుంచి ఉత్తరం ఏమైనా వచ్చిందా...అబ్బాయి ఏమన్నా ఉత్తరం రాశాడా..ఈ మాటలు పాత సినిమాల్లోనే వినిపిస్తాయి. కనిపిస్తాయి. అంతే కదా.*
*ఇక ఆకాశవాణి, దూరదర్శన్, దిన, వార పత్రికలు అన్నీ తమ శ్రోతలు, ప్రేక్షకులు, పాఠకులకు కూడా జాబులు.. జవాబులు కార్యక్రమాలు,, శ్రోతల ఉత్తరాలు వంటి శీర్షికలుకు పేర్లు మార్చుకోక తప్పదు మరి*
*కాలం మారి కార్డు, ఇన్లాండ్ లెటర్ ,కవర్ అన్నీ మాయం. ఇవి లేకపోతే ఇక అవి వేసే ఎర్ర డబ్బా అవసరం పోయింది. అంతే ఇప్పుడు ఈ డబ్బా మాయం. మనము మరచిపోవటం కష్టమే. ఎందుకంటే ఇది మన హృదయ స్పందనగా ఉండేది కదా...లోహపు పెట్టే కానీ మనిషి తనం నింపుకున్నది. పైగా అందరి కష్టసుఖాలు, సంతోషాలు , అభిప్రాయాలు అత్యంత గోప్యంగా మోసిన పెట్టె . మామూలిది కాదు.. కవుల కలాల్లో , సినిమాల్లో , సాహిత్యంలో భాగమైంది కదా. ఇక అన్నీ పోస్ట్ చేయని ఉత్తరాలే..జీవన ప్రయాణంలో భాగమైన పెట్టే కదా...ఎలా మరచి పోగలం.. సాధ్యమా.. సెప్టెంబర్ ఒకటి నుంచి కంటికి కనిపించక పోవచ్చు కానీ మన తరం జీవించినంత కాలం మన హృదయాల్లో మాత్రం పధిలం కదా.*
*ఏ సృజన శీలి సృష్టించారో తెలియదు కానీ...చుక్క నీరు లోపలికి పోదు. గాలివాన కదపలేదు. కుంభవృష్టి అయినా, జోరు వర్షం అయినా , ముసురు పట్టినా, కొద్దిచెమ్మ కూడా తగల నివ్వదు. తల్లి సంకన చంటిపిల్లలు ను పెట్టుకుని కాపాడినట్లు చూస్తుంది. గాలికి బెదరదు.ఎగరదు. దానిలో కార్డు, ఇన్లాండ్ లెటర్, కవర్ వేయటం ఒక సరదా. వాటిని తీస్తున్నప్పుడు చూడటం అదో సరదా.*
