Showing posts with label sakuntala devi. Show all posts
Showing posts with label sakuntala devi. Show all posts

Tuesday, November 4, 2025

ABOUT SAKUNTALA DEVI, INDIAN ASTROLOGER & WRITER

 



హ్యుమన్ కంప్యూటర్ గా పేరొందిన శకుంతలాదేవి జయంతి నవంబరు 4 . క్లుప్తంగా ఆమె గురించి...

 ‘‘గణితం లేకుండా మీరేమీ చేయలేరు. మీ చుట్టూ ఉన్నదంతా అంకెలు, సంఖ్యలు, గణితమే.’’ అనేవారు - శకుంతలా దేవి

 గణితమే తన లోకంగా జీవించిన మేధావి శకుంతలాదేవి. గణితంతో మూడేళ్ల వయసులో మొదలైన ఆమె ప్రయాణాన్ని, మరణం మాత్రమే విడదీయగలిగింది.

 శకుంతలాదేవి 1929 నవంబర్ 4న బెంగళూరులోని ఒక సనాతన కన్నడ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించింది. ఆమె తండ్రి పూజారిగా ఉండటానికి ఇష్టపడక సర్కస్ కంపెనీలో చేరారు. వచ్చే ఆదాయం అంతంత మాత్రమే. అలాంటి పరిస్థితులు కూడా శకుంతలాదేవి ప్రతిభకు అడ్డుకట్ట వేయలేకపోయాయి.

 ఆమె మూడేళ్ల చిన్నారిగా ఉన్నప్పుడు తండ్రితో పేకాడుతూ ప్రతి ఆటలోనూ గెలిచేది. అంత చిన్నపాప ప్రతీసారీ తనపై గెలవడం తండ్రికి ఆశ్చర్యం కలిగించింది. తన కూతురు మోసం చేస్తుందేమోనని అనుమానం కలిగించింది. అన్ని జాగ్రత్తలూ తీసుకుని ఆడినా ఆమెదే విజయం. చివరకు.. పేక ముక్కలన్నింటినీ గుర్తుపెట్టుకోవడం వల్లనే శకుంతల గెలుస్తోందని గుర్తించాడు. ఆమె అద్భుత జ్ఞాపకశక్తిని తమకు జీవికగా ఉపయోగించుకున్నాడు.

ఆమెతో ప్రదర్శనలిప్పించాడు. అలా అలా ఆమె ప్రతిభ విశ్వ విద్యాలయాలకు చేరింది. ఆరేళ్ల వయసులో తొలిసారి యూనివర్సిటీ ఆఫ్ మైసూర్‌లో ప్రదర్శన ఇచ్చింది. ఆ తర్వాత రెండేళ్లకు అన్నామలై విశ్వవిద్యాలయంలో ఆ తర్వాత ఉస్మానియా, ఆంధ్ర విశ్వ విద్యాలయాల్లో బాల మేధావిగా ఆమె పేరు మారుమోగింది.

 శకుంతలాదేవికి లెక్కలంటే ఏమాత్రం లెక్కలేదు. ఎంత పెద్ద సమస్యనైనా ఆమె చిటికలో పరిష్కరించేవారు.